ఢిల్లీ తెలుగు అకాడెమీ
తెలుగు పూదోట
ఇదో చక్కని
తెలుగు తోట. ఈ పూదోటలో విహరించి తెలుగు పరిమళాలను అస్వాదించండి. ‘ఇంటింటా
తెలుగు ఆట పాట జీవించాలి. తెలుగు సంస్కృతి వికసించాలి. తెలుగుకి పట్టాభిషేకం
జరగాలి’ అనే తెలుగు జాతి సంకల్పానికి ఉడతాభక్తిగా స్థాపించబడింది ఇది.
మొదట్లో ఢిల్లీలోని తెలుగువారి సాంస్కృతిక అవసరాల కోసం ఏర్పడ్డా, కాలక్రమాన
తన కార్యక్రమాలను పలు ప్రాంతాలకి విస్తరింపచేసి, ఉత్తమస్థాయి కళాప్రదర్శనలకి
దర్పణంగా నిలిచి, సాంస్కృతిక రంగ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని సృష్టించి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందింది.
ఇతర రాష్ట్రాలలో ఉన్న కొన్ని తెలుగు సాంస్కృతిక సంస్థల్లా ఏడాదికోసారి
మొక్కుబడిగా ఎవరూ రాని సభలు, ఎవరికీ పట్టని కార్యక్రమాలు ఏర్పాటుచేయడం
ఎంతమాత్రం డీ.టీ.ఏ. ఉద్దేశం కాదు. బళ్ళారి, స్థానం లాంటి నటులు, బాలమురళి,
ఈమని లాంటి సంగీత విద్వాంసులు, విశ్వనాథ, శ్రీశ్రీ, సినారె లాంటి
సాహితీవేత్తలు, యామినీ కృష్ణమూర్తి, రాజా రాధారెడ్డి లాంటి నాట్యాచార్యులు...
ఇంకా మరెందరో తెలుగు శిల్పులు, చిత్రకారులు రాష్ట్రేతర తెలుగు సంస్థల
కారణంగానే అంతర్జాతీయ ఖ్యాతి గడించారన్న విషయాన్ని గుర్తించి, తెలుగువారి
ఉత్తమ సంస్కృతిని మాత్రమే పలుచోట్ల ప్రదర్శించడానికి డీ టీ ఏ కంకణం
కట్టుకుంది.
సాంస్కృతిక రంగంలో తన వంతు సేవలందించాలనే ఉద్దేశ్యంతో కళాకారుల ప్రతిభకి
పట్టం కట్టే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలుగు భాషా
సాంస్కృతిక వికాస సంవత్సర సందర్భంగా వేటూరి శత జయంతి జరుపుతూ గరికిపాటి
అష్టావధానం, సినీ నటుల నాటికోత్సవం, వాగ్గేయకారుల సంగీతోత్సవం, విశాఖ శారదా
పీఠాధిపతి జీవితచరిత్ర పుస్తకావిష్కరణ, ప్రజా గాయకుడు జయరాజు, లలిత సంగీత
సుధానిధి మోహనకృష్ణ, సాహితీవేత్త పోతుకూచిలకి ప్రతిభా పురస్కారాలూ, లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం, భారతీయ నాట్య ప్రక్రియలను పదిహేను
నిముషాలలో ప్రదర్శింపజేయటం, శతవాద్య సంగీత కచ్చేరి లాంటి వినూత్నమైన
కార్యక్రమాలు ఎన్నో ఏర్పాటు చేసింది.
నిష్ణాతులు ఎందరికో వారి సేవలకి గుర్తింపుగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను
ప్రదానం చేస్తూ ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, విజయనగరం
లాంటి పలు నగరాల్లో జైత్రయాత్ర చేస్తూ వస్తోంది. సంస్థ సభ్యులకోసం శ్రీలంక
విహారయాత్ర ఏర్పాటు చేసింది. ఢిల్లీ తెలుగు అకాడమీ ఒక ఏకతా సేతువు.
‘ఒక్కటేరా తెలుగుదేశం, ఒక్కటేరా తెలుగుభాష! ఎక్కడున్నా తెలుగులందరు ఒక్కటేరా!’
అనేది దాని నినాదం. దాని స్ఫూర్తి ఋగ్వేదం ప్రస్తుతించే సుహృద్భావం :
సమానీవ ఆకూతిః
హృదయాని వః
సమానస్తు వో మనో యథా వః సుసహాసతి ...
మా ఆశయాలు,
హృదయాలూ, మనసులు ఒకటగు గాక!
మా నడుమ ఏకీభావం వర్ధిల్లుగాక!