ఎందరో మహానుభావులు


ఢిల్లీ తెలుగు అకాడమీ
26 వ వార్షికోత్సవాలకి అందరికీ స్వాగతం
 

దేశ కాల పరిస్థితులలో పెనుమార్పు వచ్చింది. ఇంతకుముందు ఎన్నడూ లేని అనేక సమస్యలు కలవరపెడుతున్నాయి. భాషల మధ్య సంబంధాలు బలపడకపోగా బలహీనమవుతున్న కాలం వచ్చింది. తల్లిపాల రుణం తీర్చుకోవాల్సిన ఈ తరుణంలో మరోసారి మనం అందరం కంకణం కట్టుకుందాం! ప్రతి ఇంటా తెలుగు ఆట పాట జీవించాలి. తెలుగు సంస్కృతి జీవించాలి. తెలుగుకు పట్టాభిషేకం జరగాలి. భారతీయ సంస్కృతి విశ్వమానవ సంస్కృతిలో అంతర్భాగమనీ, తెలుగు సంస్కృతి దానిలో అవిభాజ్యమైన జీవధార అనీ మనం అందరం గుర్తించాలి.

సంస్కృతికి, సాంస్కృతిక సంస్థలకి ఎల్లలు ఉండవు. మనోవికాసానికీ, భావ సమైక్యతకీ దోహదం చేసే పంచామృతాల్లాంటి సంగీతం, సాహిత్యం, నాట్యం, నాటకం, చలనచిత్ర కళలని ఒక వేదికపైకి తీసుకొచ్చిన ఘనత మన అకాడమీదే. పుట్టింది ఢిల్లీలోనే అయినా ఇది అనేక చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తిరుపతి, విజయనగరం, విశాఖ నగరాలలో ప్రముఖ సంగీత విద్వాంసులచే శాస్త్రీయ, భక్తి సంగీతోత్సవ వేడుకలని నిర్వహించింది. బాలగంధర్వులైన చిన్నారులతో సంగీత విభావరులని ఏర్పాటు చేసింది. సినీవాగనుశాసనుడు వేటూరి జయంతి జరిపి, కళాతపస్వి విశ్వనాథ్ కీ, బహుముఖ ప్రజ్ఞాశాలి భరణికీ, మీడియా మొఘల్ పాలకుర్తికీ జీవన సఫల్య పురస్కారాలనీ అందజేసింది. అవధాన ప్రక్రియకి ప్రాచుర్యం కలిగిస్తూ, వేటూరి ప్రభాకరశాస్త్రి జయంతి సందర్బంగా గరికిపాటి అవధానాన్ని ఏర్పాటు చేసింది. విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి జీవిత చరిత్ర గ్రంథాన్ని ఆవిష్కరింపచేసింది. లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం పదిహేను నిముషాలలో ఆరు భారతీయ నాట్య రూపాలని ప్రదర్శింపచేసింది. శతవాద్య సంగీత విభావరిని నిర్వహించింది. నాటకరంగానికి చేయూతనందిస్తూ చలనచిత్ర నటీనటులచే రెండు రోజులపాటు వినూత్నమైన నాటికోత్సవాన్ని ఏర్పాటుచేసింది. ప్రతీ ఏడూ ప్రతిభాపురస్కారాలతోనూ, జీవన సఫల్య పురస్కారాలతోనూ ప్రముఖులని సత్కరిస్తూనే ఉంది.

ఈనాడు అకాడెమీ తన ఇరవై ఆరవ వార్షికోత్సవం ‘వందేళ్ళ సినిమా’ ఇతివృత్తంగా వేడుకలు జరుపుకుంటోంది. మన థియేటర్ల సంఖ్య నాలుగువేలకి చేరుకుంది. ఆధునిక సౌకర్యాలతో ఎన్నో స్టూడియోలు వెలిశాయి. మన సినిమా రంగం చిత్ర నిర్మాణంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపులు పొందుతోంది. సినిమాకి ఎల్లలు లేవు. హాలీవుడ్ ని ఆదరిస్తున్నాం. బాలీవుడ్ ని హత్తుకుంటున్నాం. తమిళం ని నెత్తిన పెట్టుకున్నాం. కన్నడం ని కళ్ళకి అద్దుకుంటున్నాం. మళియాల మోహంలో పడ్డాం. మూకీల యుగం నుంచి మల్టీప్లెక్స్ ల తరందాకా ప్రతీ మలుపు దగ్గరా సినీజెండా రెపరెపలాడుతూ ఉంటుంది. కుల, మత, ప్రాంతీయ భావాలు లేకుండా ఇంకా ఎన్నో తరాలు, యుగాలు మన వెండి తెర గర్వంగా తలకెతుకుంటుందనడంలో సందేహం లేదు.

ఒకరికి ఒకరు తోడుండాలి. నలుగురు కలిసి చేతులు కలపాలి. ఒక్కరికోసం అందరు కలియాలి, అందరికోసం ఒక్కరూ నిలవాలి. అందరం ఒక్కటై ముందుకు పోవాలి! ఈ సుభాషితం మన లక్ష్యం కావాలి. మన అకాడెమీని మరింత బలోపేతం చెయ్యడంలో మీ వంతు సహకారం అందించమని కోరుతున్నాను. సాంస్కృతిక రంగంలో సువర్ణాధ్యాయాన్ని సృష్టించడం కోసం, మరిన్ని సామాజిక కార్యక్రమాలని చేపట్టడం కోసం మీరందరూ ముందుకు వచ్చి మీ అమృత హస్తాన్ని అందించాలి.

అందరికీ హృదయపూర్వక వందనాలు.

ఎన్.వి.ఎల్. నాగరాజు
వ్యవస్థాపక కార్యదర్శి